వెలుతురు రెక్కలు

కిటికీ బయటకు
చేతిని ఉంచినపుడు
ఒక నీలిపాట
ఒక మిణుగురునృత్యం
మనలోపల దృశ్యమై తగలాలి

దోసిలినిండా పట్టుకొచ్చి
గదిలోన ప్రదర్శనకు దాచి
ఈ పూట
వెలుగుతున్న దీపం చుట్టూతా
తూనీగలమై
రెక్కల్ని వెచ్చబరుచుకుందాం

ఆకాశం కూడా నల్లని
సముద్రమై
దీపం కింద ఎగసిపడుతున్నపుడు
వెలుతురు రెక్కలను
అమావాస్య
దేహంమీద పడవలుగా వదిలి
రేపటి రోజుని వెలిగిద్దాం

ఏం చేస్తారు

ఒక రాతిమీద
ఒక చెరువుమీద
ఒక కొమ్మమీద
పక్షి ఎగురుతున్న దృశ్యం రాస్తాను
దూరాలు కనబడని లక్ష్యాన్ని
నిర్దేశించి మరీ ఎగరేసినట్టు రాస్తాను
రెక్కలు విదిల్చిన చోటల్లా
ఈకలు మొలిచినట్టు
పక్షి దాటిన మట్టిపైనంతా
నది నిద్రలేచినట్టు
ఆకాశమంతా సముద్రం చేతిలోని
పసిపాపడిలా కేరింతలు కొడుతున్నట్టు రాసేస్తాను
నది భుజంపై
మొలిచిన ఈకల తలలమీద
పక్షులు ఊపిరి అందుకుంటున్నట్టు రాస్తాను
మొదటి పక్షిని వదిలేసి
కొత్త పక్షులను ఎగరేసినట్టుగా ఇంకోక
దృశ్యాన్ని రాయగానే,
సమూహం ముందు నిలబెట్టి
నన్నెవరో హత్య చేసి నా ప్రాణాన్ని
ఎగరేస్తున్నారు
ఎగరడం తెలిసినవాణ్ణి
ఎగరడం మాత్రమే తెలిసినవాణ్ణి ఇంతకంటే ఏం చేస్తారు




ఎందుకోగానీ

ఎందుకోగానీ
ఒక మరణం పుడుతుంది దగ్గరలో
నీడ ఒలికిన శబ్దంగానీ
శ్వాస ప్రవహించిన గుర్తులుగానీ
మట్టి అంటుకున్న గాయాలుగానీ
ఒలిచి ఒలిచి చూసుకున్నా కనబడదు
శరీరమంతా, 
సముద్రాల అట్టడుగుల్లో పారాడే నిర్వేదనల 
దుమారం కప్పేస్తుంది 
నీలిరంగు మంటపిడికిట్లోంచి నడుచుకుంటూనో
ఇసుక దిబ్బల కౌగిట్లోంచి పారాడుతూనో
నిశ్చలమైనదొక శవం దగ్గరికి చేరుకునీ
సముద్రానివై పొగిలి పొగిలి
రెక్కలాడిస్తావు
చుట్టూ నల్లమేఘాల చప్పట్లలోంచి
తెల్లని కెరటాలు చెంపమీద ఆడుకుంటాయి
ఆకాశాన్నీ ఎవరో రాయి పెట్టి కొట్టినట్టు
రాత్రి..
పొట్టులా చీకటి... 
తలపైన రాలిపడుతుంటాయి 
ఒంటికి గాయమైనట్టు
మట్టి కారుతుంది ధారగా
ఆ మట్టిలో తడిసి
ఆ మట్టిలో నిండా మునిగి
మనిషిలా నిటారుగా 
ఒకింత నెమ్మదితో పురాతన మానవరూపంతో
మొదలవడం అత్యవసరమని తెలుస్తుంది
అప్పటికి తెలుసుకోవాలంతే
బ్రతుకుని బ్రతుకులా మోయడమని
బ్రతుకులోకొచ్చి 
భుజంపై చేయి వేయగల 
ఒక మనిషిని చూడడం 
ఆ ఒక మనిషికోసం బ్రతుకని తెలుసుకోవాలంతే

ఓ పిల్లాడు - అతని దృశ్యం


ఎక్కడో ఓ పిల్లాడు ఓ దృశ్యాన్ని గీస్తాడు
జీవితంపై మట్టిని అద్దుకుని
బ్రతికేందుకు ఒక అడవిని నిర్మించుకుంటాడు
మొక్కలతో మనిషిగా ఎదగడానికి ఊపిరందుకుంటాడు

ఎక్కడో ఓ పిల్లాడు ఓ దృశ్యాన్ని ఊహిస్తాడు
ఓ పక్షిగూడును శ్రద్ధగా అల్లినట్టుగానో
రెక్కలు తెగిన పక్షికి చేతులిచ్చినట్టుగానో
మనిషిలోకి ఓ సముద్రాన్ని పారబోసినట్టుగానో

ఎక్కడో ఓ పిల్లాడు ఓ దృశాన్ని కలగంటాడు
ప్రాంతమొక నిరంతర రక్తప్రవాహమైనట్టు
నడుస్తున్న దారంతా చీకటి దారమైనట్టు
తాకిన ప్రదేశమంతా కిందికి కృంగిపోతున్నట్టు
ప్రపంచానికొక చివర నిలబడి నేలమొత్తాన్ని జేబు నింపుకున్నట్టు

పిల్లాడికి ఆడుకోవడం విసుగనిపించి
కదిలాడక్కడి నుంచి
లెక్కపెట్టలేనంత దూరం కదిలెళ్ళిపోయాడు
ఒక సమూహంలో ఆగి చూసుకున్నాడు
పిల్లాడు గీసిన మట్టిపై అడవి మొలిచి మనిషున్న ఆనవాళ్లు
గూడులో పక్షి చేతుల్తో సముద్రాన్ని దాచుకున్న సాక్ష్యాలు
కలగన్న ప్రాంతంలో చీకటి దరువుతో
నేలంతా నృత్యం చేస్తుండడం చూస్తున్నాడు

ఇపుడా పిల్లాడికి సమూహమే దేహం
సమూహమొక ప్రాణం
పిల్లాడిని సమూహంలో వదిలేసి చూడండిక
అతనో సమూహమై వస్తాడు

అతడొకడే

చెట్ల కొమ్మలనిండా పిట్టల కేరింతలతో
అలుముకున్నట్టు
చెవినిండా మాటలు ఘల్‌ఘల్ మని 
అల్లరి చేస్తున్నాయి
ఎవరో తోసేస్తే తిరగబడ్డ పురుగులా
అటుఇటు అక్కడక్కడేనో,
లోలోపల
చీకట్లలోనో తిరుగుతున్నాడతను
నడుస్తుంటే కిందనుంచి అతడి పాదాలపై
ఇంకొకరి చిన్నిపాదాలు ఆన్చిన పిచ్చి భావోద్వేగానికి
కళ్లు మూస్తే చిట్టిచిట్టి చేతుల్తో
ఇంకొకరు కళ్లు మూసిన తడి తన్మయత్వానికి
అల తాకిన ఒడ్డులా 
అతడిలోకి అతడే కరిగిపోతున్నాడు వింతగా
గదిలో విసిరేసిన వస్తువులా 
చప్పుడు చేయకుండా అతడొకడే
శూన్యంలోకి చూస్తున్నట్టుగా తలపైకెత్తి 
కాగితాలపై కన్నీళ్లతో
సంతోషాన్ని నింపుతున్నాడు
ఓ పాప తన చుట్టూ ఆడుకున్న అల్లరిని
ఓ పాప అతడి చేతుల్ని పట్టుకుని తన చిన్ని ప్రపంచాన్ని
చూపించిన ఆనందాన్ని
ఓ పాప సృష్టించిన పూల వంతెనల సంతోషాన్ని
హద్దుల్లేకుండా అరమరికలు లేకుండా
లోకాల్ని దాటి సముద్రమంత ఉధృతంగా 
చుట్టూ ప్రవహించేందుకు తోడొచ్చిన ఓ పాప జ్ఞాపకాన్ని
కన్నీళ్లతో కప్పేస్తున్నాడతడు
పాపను విడిచుండలేని తన పసితనాన్ని
అద్దం ముందు దోషిలా నిలబెట్టి 
వికృతంగా వెక్కిరిస్తూ అతడినతడే దూషించుకుంటున్నాడు
నీటి అడుగుల కింద నలుగుతున్న
గులకరాయిలా
ఆ గది గోడలకింద వూరకనే పడున్నాడతడు 
వూరికే అంటే వూరకనే అని కాదుగానీ
కొన్నికొన్ని సార్లు పనిచేస్తాడు
చాలాసార్లు పుస్తకాల్లోకెళ్ళి తలబాదుకొని
చరిత్ర దారులనిండా శిథిలాలను కదిలించో పడదోసేసో
వర్తమాన వీధులవెంట వెర్రికేకలను విసిరేస్తూనో
మళ్లీ వొచ్చి కూలబడతాడు

మౌనంగా

ఆకాశంపై నల్లమేఘాల్లా
అమాంతం కురుస్తారు పిల్లలు గెంతుకుంటూ
వరండా అంతటా
అల్లరల్లరిగా శబ్దాలను జల్లేసిపోగలరు
మౌనంగా వుండిపోతే
పక్షుల్లా నీ చుట్టే కేరింతల రెక్కలిప్పుతూ
నిన్నో నీటిపాయగా కదిలిస్తూ
ఆలోచనలను జ్ఞాపకాలను
అన్నిటినీ ముక్కలు ముక్కలుగా విరిచేస్తారు
అలాగే మౌనంగా వుండిపోతే
నువ్వు చూస్తుండగానే
నీ గుండెలోంచి నవ్వుని తీసినట్టు
మట్టిని తవ్వి ఏదో దాచిపెట్టి
గాల్లో ఎగురుతూ నిశ్శబ్దంగా వెళ్లిపోతారు
చీకటిని హత్యచేసిన వెలుతురు హంతకుడు
ఉదయాన్నే నీ భుజం తట్టి
వరిధాన్యంలాంటి సూరీడిని చూపెడతాడు
అంతే మౌనంగా కూర్చొని
ఒక్కటంటే ఒక్క కాఫీ గుక్క చప్పరించాక
అన్ని మొక్కల మధ్యలోంచి పువ్వొకటి
నిన్నావరిస్తుంది
మౌనంగానే వుండిపోతావిక
ఎప్పటికీ మాట్లాడనివ్వని
పరిమళం నిన్నామాంతం మింగేస్తుంది

బదులుగా

వాలుగా గోడకాఁని చేతులు కట్టుకుని 
దారినపొయే వారందర్నీ చూస్తుండిపో
ఎండను కప్పుకుని పోయేవారు
మట్టిని పూసుకుని పోయేవారు
చుట్టూ పరిసరాల్ని గుప్పిట్లో నింపుకొని పోయేవారు
తలపైకెత్తుకునో
తలొంచుకునో 
కాళ్లీడుస్తూనో, కాలాన్నీడుస్తూనో 
బ్రతికినంతగా బ్రతుకునిండా ఖాళీల్నీ నింపుకునేవారో 
కాసేపుండి
మౌనంగా తిరిగొచ్చేయ్ 
దారినిండా పగుళ్లమయమైన చీకటి పుప్పొడి 
రాత్రికి వర్షమై 
ఎవ్వరూ లేని ఆ రాత్రిలో 
నదిలానో ఏరులానో
ఒగరుస్తూ 
విహ్వలమవుతూ
జీవశక్తిని నింపుకుంటోందేమో ఎవడు చూడొచ్చాడు
నువ్వు చూడాల్సింది 
మూకుమ్మడిగా కదుల్తున్నట్టున్న
అర్ధాలంకారమయమైన లోకాన్ని...
అంతటిని ఒకే రూపంగా 
అపారమైన శూన్యదృక్కులతో చూడాలంతే
నువ్వే అనంతమైన రూపాల్లో తిరుగుతుంటావు
పలుకులు పలుకులుగా విడదీసి
కాలందారంతో కుట్టేసి ఎగరెయ్ 
బదులుగా పక్షిలా 
ప్రపంచమూ రివ్వున ఎగరగలదేమో

 
సత్యగోపి Blog Design by Ipietoon